కాలివేళ్లతో ఆణిముత్యాలు
జమ్మికుంట, న్యూస్‌టుడే: అవయవాలన్నీ సక్రమంగా ఉన్నా మూడుగంటల్లో పరీక్ష రాయడమంటే కొంచెం కష్టతరమే. కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన విద్యార్థిని కర్రెజ్యోతి (18) మాత్రం రెండుచేతులు లేకున్నా కాలివేళ్లతో సునాయసంగా ఇంటర్ పరీక్షను రాసేసింది. జమ్మికుంట గ్రామపంచాయతీ పరిధిలోని హన్మాండ్లపల్లిలో నివాసముంటున్న జ్యోతి పదేళ్ల కిందట అనారోగ్యానికి గురై రెండుచేతులు చచ్చుబడిపోయాయి. గొంతు కూడా మూగబోయింది. ఆర్థికస్థోమత లేక వైద్యానికి పూర్తిగా దూరమైంది. అయినా వెరవక చదువుపై ఉన్న మమకారంతో కాలివేళ్లతో రాయడం అలవర్చుకుంది. పట్టుదలతో పదోతరగతి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం ఇంటర్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జ్యోతి బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరై కాలివేళ్లతో చకచకా రాసేసింది. పరీక్షను కేవలం రెండుగంటల్లో ముగించింది. ఆమెలోని ఆత్మవిశ్వాసం తోటి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపింది. జ్యోతి మంచి చిత్రకారిణి కూడా. కాలితో ఆమె వేసిన చిత్రాలు బహుమతులు సాధించిపెట్టాయి.
Eenadu – Mar-12-2010
